Saturday, November 21, 2015

గోరెటి వెంకన్న రాసిన పక్షి వేదం

                                
       

 ఓ పుల్లా...ఓ పుడకా..
ఎండుగడ్డి..సిన్న కొమ్మ....చిట్టి గూడు...
పిట్ట బతుకే ఎంతో హాయి...

చిగురుటాకు...వగరు పూత...
లేత పిందే...తీపి పండు...నోటికంది..
చింతలేక కునుకు తీసే
పక్షిబతుకే స్వర్గమోయి        ఓ పుల్లా...ఓ పుడకా..

పూటకుంటే అంతేచాలు...
రేపు ఎట్లనే ధ్యాస లేదు...
దాసుకునెటి గుణమూ లేదు
లోభితనమూ ఎరుకా లేదు...        ఓ పుల్లా...ఓ పుడకా..

ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి....
ఎత్తయిన మర్రిమీదకెక్కి కూసుంటవో....
చెరవంచు బురదలో చేపలను వేటాడి
నల్లతుమ్మ మీదేక్కి మెల్లంగ ఒదుగుతావు
ఎత్తు మర్రయినా....నల్ల తుమ్మయినా
ఇంత కొమ్మ ఉంటే కొలువుంటవు కొంగమ్మా....    ఓ పుల్లా...ఓ పుడకా..

ఒంటి కాలు మీద నిలిచి
ఒడుపుతో చేపనుబట్టి
గూటిలోని బిడ్డకొరకు నోటకరుచుకుని పోతే..
దొంగ కొంగజపమని నిందలంటగట్టె నరుడు...
ఏలెడంత పొట్టనీది...ఎందుకమ్మ అంత నింద....
నరుడు తప్ప పుడమిలోన.... కొంగమ్మా...
ఏ జీవి కపటమెరుగదమ్మా కొంగమ్మా....    ఓ పుల్లా...ఓ పుడకా..   

రామచిలుకా...పాలపిట్ట...
తీతువమ్మా....గోరువంక
నరుడు పెట్టిన పేర్లు తప్ప
తమకు ఊరు పేరూ తెలవదు...
ఆ పేరు కోసం ఉనికి కోసం
వీసమంత ఆరాటం ఎరుగవు...        ఓ పుల్లా...ఓ పుడకా..

చీకటైతే ఒదిగిపోయి...
వేకువానే నిదురలేచి
గాలిలోన ఈదుకుంటా...
గగనమంచుల తేలుకుంటా...
కొండకోనలు దాటుకుంటా...
కొమ్మరెమ్మలు వాలుకుంటా...
ఎల్లవింతలు కళ్లజూసినా
మళ్లీ చిన్ని గూటిలోకి వచ్చి
పున్నమి ఉయ్యాలలూగు..        ఓ పుల్లా...ఓ పుడకా..

చదువు నేర్పే సాలె లేదు....
బోధ చేసే గురువు లేడు...
వణుకు పుడితే....ఉడుకు లేదు...
రోగమొస్తే మందులేదు
అన్నీ ఉన్నాయన్న నరుడు
ఆశా లోభం వెంటాడంగా...
ఏమిలేని పిట్ట చెంతకు
చేరి జాతకమడుగుతుండూ....

ఓ పుల్లా...ఓ పుడకా..
ఎండుగడ్డి..సిన్న కొమ్మ చిట్టి గూడు...
పిట్ట బతుకే ఎంతో హాయి...

No comments:

Post a Comment