Saturday, November 21, 2015

గోరెటి వెంకన్న రాసిన పక్షి వేదం

                                
       

 ఓ పుల్లా...ఓ పుడకా..
ఎండుగడ్డి..సిన్న కొమ్మ....చిట్టి గూడు...
పిట్ట బతుకే ఎంతో హాయి...

చిగురుటాకు...వగరు పూత...
లేత పిందే...తీపి పండు...నోటికంది..
చింతలేక కునుకు తీసే
పక్షిబతుకే స్వర్గమోయి        ఓ పుల్లా...ఓ పుడకా..

పూటకుంటే అంతేచాలు...
రేపు ఎట్లనే ధ్యాస లేదు...
దాసుకునెటి గుణమూ లేదు
లోభితనమూ ఎరుకా లేదు...        ఓ పుల్లా...ఓ పుడకా..

ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి....
ఎత్తయిన మర్రిమీదకెక్కి కూసుంటవో....
చెరవంచు బురదలో చేపలను వేటాడి
నల్లతుమ్మ మీదేక్కి మెల్లంగ ఒదుగుతావు
ఎత్తు మర్రయినా....నల్ల తుమ్మయినా
ఇంత కొమ్మ ఉంటే కొలువుంటవు కొంగమ్మా....    ఓ పుల్లా...ఓ పుడకా..

ఒంటి కాలు మీద నిలిచి
ఒడుపుతో చేపనుబట్టి
గూటిలోని బిడ్డకొరకు నోటకరుచుకుని పోతే..
దొంగ కొంగజపమని నిందలంటగట్టె నరుడు...
ఏలెడంత పొట్టనీది...ఎందుకమ్మ అంత నింద....
నరుడు తప్ప పుడమిలోన.... కొంగమ్మా...
ఏ జీవి కపటమెరుగదమ్మా కొంగమ్మా....    ఓ పుల్లా...ఓ పుడకా..   

రామచిలుకా...పాలపిట్ట...
తీతువమ్మా....గోరువంక
నరుడు పెట్టిన పేర్లు తప్ప
తమకు ఊరు పేరూ తెలవదు...
ఆ పేరు కోసం ఉనికి కోసం
వీసమంత ఆరాటం ఎరుగవు...        ఓ పుల్లా...ఓ పుడకా..

చీకటైతే ఒదిగిపోయి...
వేకువానే నిదురలేచి
గాలిలోన ఈదుకుంటా...
గగనమంచుల తేలుకుంటా...
కొండకోనలు దాటుకుంటా...
కొమ్మరెమ్మలు వాలుకుంటా...
ఎల్లవింతలు కళ్లజూసినా
మళ్లీ చిన్ని గూటిలోకి వచ్చి
పున్నమి ఉయ్యాలలూగు..        ఓ పుల్లా...ఓ పుడకా..

చదువు నేర్పే సాలె లేదు....
బోధ చేసే గురువు లేడు...
వణుకు పుడితే....ఉడుకు లేదు...
రోగమొస్తే మందులేదు
అన్నీ ఉన్నాయన్న నరుడు
ఆశా లోభం వెంటాడంగా...
ఏమిలేని పిట్ట చెంతకు
చేరి జాతకమడుగుతుండూ....

ఓ పుల్లా...ఓ పుడకా..
ఎండుగడ్డి..సిన్న కొమ్మ చిట్టి గూడు...
పిట్ట బతుకే ఎంతో హాయి...

Wednesday, November 18, 2015

కంచెను తుంచే అక్షరాస్త్రం


  సీతారామ శాస్త్రిగారు...కంచెకు మీరు రాసిన పాటలు        ఇప్పటి మారణ హోమాల సృష్టికర్తలకు చెంపపెట్టులు


నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరననే పంతమా...
నువునేనని....విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మించనీ

విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అదిమనిషిది ఐ ఉంటుందా
అడిగావ భుగోళమా
నువ్వు....చూసావా ఓ కాలమా

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే...చెరిపే సంకల్పం అవుదాం

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా...
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా...
ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా
రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం
రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం
సాధించేదేముంది ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

అందరికి సొంతం అందాల లోకం
కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కల్యాణం కోసం ఇంతటి కల్లోలం
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరననే పంతమా
ఖండాలుగ విడదీసే జెండాలన్ని
తలవంచే తలపే అవుదాం
ఆ తలపే మన గెలుపని అందాం

-----------------------------------------------------------------------------------


                       మరోపాట...
భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో....
ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
ఏ పంటల రక్షణకీ కంచెలముళ్లు
ఏ బ్రతుకుని పెంచుటకీ నెత్తుటి జల్లు
ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు
ఏ దాహం తీర్చవు ఈ కారుచిచ్చులు
ప్రాణమే పణమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడూ... మేలుకొలుపు మేలుకొలుపు
అంతరాలు అంతమై అంతా ఆనందమై
కలసిమెలసి మనగలిగే కాలం చెల్లిందా
చెలిమిచినుకు కరువై పగలసెగలు నెలవై
ఎల్లలతో పుడమి ఒళ్లు నిలువెల్లా చీలిందా

ఈ నిషినిషాదకరోన్ముక్త  దురిత శరాఘాతం
మృదులాలసస్వప్నాలస హృత్కపోతపాతం
పృథు వ్యధార్త పృధ్విమాత నిర్ఘోషిత చేతం
నిష్ఠురనిశ్వాసంతో నిశ్చేష్ఠిత గీతం
ఏ విషబీజోద్బూతం ఈ విషాదభూజం
ప్రాణమే పణమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడూ... మేలుకొలుపు మేలుకొలుపు
భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో....
ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో

Tuesday, November 10, 2015

జీవన వ్యాకరణం నాగభైరవ కోటేశ్వర రావు

ఆర్జన అర్ధానుస్వారం
ఆస్తి పూర్ణాను స్వారం
బహువ్రీహి సమాసాల సారం...
బ్రతుకులో నేను చేరనోచని తీరం
జీవితంలో నఇ్ తత్పురుష లనంతం
జీతం ఒకటో తారీఖునే అంతం

చేసేది తెలుగు మాష్టరీ గిరి
ఈదేది కావ్యసుధాలహరి
వ్యావహారికమూ గ్రాంథికమూ కాని
వాక్యాలు దిద్దడం తప్పనిసరి

కష్టాల ఆదేశమూ
కన్నీళ్ల ఆగమమూ
జన్మంతా నాది కాని
పరాయిదైన తత్సమమూ
కాదంటే తద్భవమూ

కాలేజీలో నా వేషం దేశ్యం
క్లాసు రూములో చెప్పేది గ్రాంథికం
అది విద్యార్దుల చెవులకు అన్యదేశ్యం

అప్పులూ పిల్లలూ ఆమ్రేడితాలు...
జీతాల్లో ఇంక్రిమెంట్లు ఉపసర్గలు
అప్పుడప్పుడు జరిగే సన్మానాలు విసర్గలు

కట్టుకున్న యింట్లోదాని సతాయింపులు నిత్యాలు
కన్నపిల్లల ఆగడాలు వైకల్పికాలు
బడిలో కుర్రాళ్ళ గోలలు బాబూ...అవి బహుళాలు

చేసేది తెలుగు మాష్టరిగిరి
ఈదేది కావ్యసుధా లహరి

కర్మధారయ సమాసాన మువర్ణానికి
పు, ంపు లైనప్పుడు...
కాతా కొట్టువాడి ముందు నాకు తలవంపులైనప్పుడు
బహువ్రీహి సమాసంబుల స్త్రీవాచక శబ్దంబుల
ఉపమానంబుల మీది ’మేను’నకు ’బోడి’యైనప్పుడు
ఇరవై ఐదు ముప్ఫై తారీఖుల మధ్య
ఇరుగ్గా ఉన్న నా అద్దె ఇంటికి
ద్వంద్వ సమాసాల్లాంటి బంధువుల జంటలు
దుగాగమ సంధుల్లా వచ్చి వాలినప్పుడు
ఎంత విశాలమైనా నా ఎడద ఇల్లు
వింతగా గుచ్చుకుంటోంది అందులో ముల్లు

చేసేది తెలుగు మాష్టరిగిరి
ఈదేది కావ్యసుధా లహరి

వరూధినీ సత్యభామల్లాంటి
ప్రబంధకన్యలతో పగలంతా విహారం...
రసికత తెలీని పిల్లల తల్లితో 
రాత్రులు నా పాండితి రసాభాసం 

అలంకార శాస్త్రాన్ని గూర్చి
అష్టవిధ శృంగార నాయికలని గూర్చి
ఏడ పిరియడులు,ఏకబిగిని
ఉపన్యసించగల నాకు 
చూడు బ్రదర్ ! శృంగారం కంఠగతమే!

చేసేది తెలుగు మాష్టరిగిరి
ఈదేది కావ్యసుధా లహరి

క్రమశిక్షణా రాహిత్య రాజ్యాధి నేతలు
హిప్పీలకు బీటిల్స్ కి  ఫ్యాషన్స్ లో భ్రాతలు
నిత్యమూ సినీ దర్శనానురక్తులు
మదంతేవాసులు  లు వర్ణకాలు....

సినిమాలో లతా గళము విని సొక్కే  నా శిష్యుడు..
కావ్యాల్లో కోయిల గళకలరావము ఓర్చలేడు
నగ్న తారలను తెరపై నయనానందంగా చూచి...
వరూధినీ ప్రణయాన్ని నిరసించక ఉండలేడు
చేసేది తెలుగు మాష్టరిగిరి
ఈదేది కావ్యసుధా లహరి

విలాసాల లఘువులుగా చేసి...
విలాపాలు గురువులుగా వేసి...
వ్రాసుకున్న  జీవిత కావ్యం నిండా 
శార్దూలాలు, మత్తెభాలు
గాండ్రిస్తున్నాయ్, ఘీంకరిస్తున్నాయ్
ఉత్పలమాలలు, చంపమాలలు
ఉన్నా అడపాదడపా
శకట ఱేఫాల కోపాలకి
సలాం చేసి మోకరిస్తున్నాయ్..
ఈ కావ్యంలో లేదు ప్రసాదం
లేదు మాధుర్యం, అసలే లేదు ఓజస్సు
ఇది ఇరవై నాలుగు ఛందస్సుల తమస్సు

ఈ జీవిత కావ్యం
ఎప్పుడో అంకితమైపోయింది
మేనేజ్ మెంట్ కృతిభర్తకు
అతడు రాల్చే సూడిద బూడిద
చాలడం లేదు నా మనోవర్తికి
ఏ మందూ పనిచేయడం లేదు నా ఆర్తికి

అది దురదృష్టం
నా జీవితం దుష్టం
అయినా
ఆర్యవ్యవహారంబుల దుష్టంబు గ్రాహ్యంబు
అని కదా చిన్నయ సూరి వచనంబు..

Thursday, September 17, 2015

నీకు స్వర్గంలోనైనా....ఆయుష్మాన్ భవ

నేను రాసిన పై కవిత దీపాన్షు (మా ఇద్దరు పాపల పేర్లు) అనే పెన్ నేమ్ తో ఆంధ్రజ్యోతిలో గత 14వ తేదీ వచ్చింది. వందలమంది స్పందించారు. వారిలో కన్నీరు పెట్టని వారు లేరు. ఈ కవితలో గొప్పదనం లేదు..ఆ చిన్నోడి దైన్యమే అందరినీ కదిలించింది.