అయిలాన్ కుర్దీ...నీకు స్వర్గంలోనైనా ఆయుష్మాన్ భవ
కన్నీళ్లు... కన్నీళ్లు..
కట్టలు తెగుతున్న కన్నీళ్లు....
ఎవడివిరా నువ్వు?
ఈ రాతి హృదయాల్లో నీకోసం..
ఈ నీటి చెలిమెలేంటి...?
నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా...
ఆపుకోలేనంత ఈ దు:ఖమేంటి?
ఎవర్రా నువ్వు...?
నా కొడుకువు కాదు
బంధువు కాదు
నా కులం కాదు
నా మతం, ప్రాంతం,
దేశం కానే కాదు
కానీ ఎందుకు
నిన్ను చూస్తే
కన్నీరు ఏరులవుతోంది?
ఎన్నెన్ని చూశాన్నేను
హింసలు... రక్తపాతాలు
హత్యలు.... మారణహోమాలు
చావులు... సంస్మరణలు
ఎన్నని... ఈ కళ్లతో చూశా
నా మీద ఓ కవిత రాయవూ అన్నట్లు
ఆ ఉప్పు నీటి ఒడ్డున పడి ఉన్న
నీ దేహాన్ని చూస్తే
కథలు...కవితల్లో కాదు
నా గుండెల్లో పొదువుకుని
కడుపారా ఏడవాలనిపిస్తోంది
నీ తండ్రి ఇంకా పిరికివాడేమో
నన్నూ నా కొడుకుతోపాటు
పాతిపెట్టమన్నాడు
నేనే నిన్ను కన్నవాడినైతే
జీవం లేని నీ చిట్టి చేతులను
నా గుండెలపై వేసుకుని
ఆ ఉప్పు నీటి పరుపుపై
ఈపాటికి
నిర్జీవంగా నిద్రపోతుండే వాణ్ని
నీ దేశాన్ని, నీ ఊరును
నీ వీధినీ నీ ఇంటినీ
తుపాకులు, మరఫిరంగుల
పొగల వాసనతో నింపి
ఈ సముద్రం ఒడ్డున
నిన్నిలా అనాథను చేసిన
బద్మా్‌షలను
పీక పట్టుకుని
ఒక్కటే అడగాలనుంది
ఈ అణుబాంబులను
మీరే తీసేసుకోండి
ఈ రాజ్యాలన్నీ
మీరే ఏలుకోండి
ఈ చముర్లు, సంపదలు
ఆ కోటానుకోట్ల సిరులు
అన్నీ మీరే అనుభవించండి
వైట్ హౌసుల్లో,
రాయల్ ప్యాలెస్‌లలో
మీ దేవుళ్లు సృష్టించిన
రాజ్యాల్లో
పీకలదాకా సుఖించండి.
కానీ...,
నన్నిలా చంపి పడేసిందెవర్రా
అని అడుగుతున్నట్లున్న
ఆ చిన్నారి దేహంలో
చిన్న కదలికను మాత్రం నాకివ్వండి
అమ్మ రొమ్మును తడిమాక
ఆ చిట్టి పెదాల నుంచి వచ్చే
తీయని పాల వాసనను
ఈ ప్రపంచానికి
రుచి చూపించండి.
చేతనవుద్దా మీకు....?(అయిలాన్ కుర్దీ...సిరియాకు చెందిన మూడేళ్ల చిన్నారి. దేశంలో గొడవలకు, మారణహోమాలకు భయపడి...ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.ప్రశాంతమైన జీవితం కోసం వలస బాట పట్టిన ఓ కుటుంబ యజమానికి రెండో కొడుకు. అమ్మ భుజాల మీద కాసేపు...నాన్న బాహువుల్లో కాసేపు...అన్నతో నవ్వుకుంటూ కాసేపు...కుటుంబంతో వలస వెళుతున్నాడు...వాళ్లను దేశం దాటించాల్సిన చిన్న తెప్ప బీచ్ ఒడ్డున ఉంది. అప్పటికే పన్నెండు మంది అందులో ఉన్నారు. మునిగిపోతుందేమోనని అయిలాన్ తండ్రి భయపడ్డాడు. పడవ నడిపే వాడు ఏం కాదు...ఎక్కమన్నాడు. అదే అయిలాన్ కు చివరి ప్రయాణమైంది. అమ్మ ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉండగా...పడవ కదిలిపోతోంది. విపరీతమైన అలలు, గాలికి....బోటు తిరగడబడింది...ఒకరిద్దరు తప్ప చిన్నారి అయిలాన్ కుర్దీ సహా...అంతా గల్లంతయ్యారు. కుటుంబంలో అయిలాన్ తండ్రి ఒక్కడే బతికి బయటపడ్డాడు. చివరకు అయిలాన్ కుర్దీ మృతదేహం టర్కీలోని బోడ్రమ్ బీచ్ కు కొట్టుకు వచ్చింది. విగత జీవిగా పడి ఉన్న ఆ చిన్నారి దేహాన్ని చూసి..నేను చలించిపోయాను. జీవితంలో నన్ను అత్యంత కలతకు గురి చేసిన చిత్రమిది. చాలా రోజుల తర్వాత...నేను నిజంగా ఏడ్చాను....నా కొడుకును పోగొట్టుకున్నంత బాధగా.....)
14-09-2015న ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీలో వివిధలో ప్రచురితమైంది.
దీపాన్షు అనే పెన్ నేమ్ తో
No comments:
Post a Comment