గూర్ఖా జీవితంపై ఎండ్లూరి సుధాకర్ గారు చాలా ఏండ్ల కింద రాసిన ఈ కవిత ఓ అద్భుత కావ్యం. మంచి కవిత అనగానే నాకు గుర్తొచ్చే అతికొద్ది రచనల్లో లో ఒకటి ఇది. ప్రతి పదంలో వేనవేల అర్ధాలను, జీవిత సత్యాలను ఏరికూర్చి రాసిన పోయెమ్ . జీవితాన్ని చూసి మమైకమై రాయడమంటే నా దృష్టిలో ఇదే....హేట్సాఫ్ ఎండ్లూరి.....
అతడు రాత్రి సూర్యుడు
కళ్ల బొరియల్లోనిదుర చాప మడత పెట్టి
దొంగ చీకటిని వెంటాడుతుంటాడు
వీధి మలుపులోంచే అతడి పద ధ్వనుల్నీ, వాసనల్నీ పసిగట్టి
గల్లీ కుక్కలు గౌరవ సూచకంగా తోకలూపుతాయి
వేగుచుక్క పొడిచిందనడానికి
బీడీ ముక్క విశ్రాంతిగా పొగలు వదులుతూ ఉంటుంది
అతడు ఆరు రుతువుల చెలికాడు
కాలం అతడి చేతిలో టార్చి లైట్
భార్య తన ప్రేమంతాచేతివేళ్లలోకి
ఊలు సూదుల్లోకి నింపిఅల్లిన స్వెట్టెర్
వెచ్చని జ్ఞాపకమై హత్తుకుపోతుంది
ప్రతి నడిరేయి
ప్రతి తెల్లవారుజామున
వేల వేల ఆలింగనాలూ,చుంబనాలూ
వేడి నిట్టూర్పులూ, వేడికోళ్ళూ,
రహస్య రసోద్రేకాల మీదుగా
నిర్లిప్త పరివ్రాజకుడై నడిచిపోతుంటాడు
అతడికి సెలవులుండవేమో
అతడి అపరిపక్వ కోర్కెలు పండవేమో
అర్థ రాత్రి భార్యా బిడ్డల్ని విడిచి
ప్రతి రాత్రీ గౌతమ బుద్ధుడవుతాడు
ఎక్కడివాడో తెలియదుగానీ మనకత్యంత ఆప్తుడనిపిస్తాడు
తలపై కత్తుల కరచాలనం గుర్తు లాంటి ఉన్ని టోపీ
బాగా మాసిన ఖాకీ దుస్తులు
గొప్ప గౌరవం పుట్టిస్తూ గంభీరంగా కనపడతాడు
మంత్రదండంలాంటి అతడి చేతికర్ర చప్పుడు
మన భయోద్వేగాన్ని తగ్గించే మందు
మధ్య రాత్రులు మన గేటు తట్టి
నిద్రా భంగంలోనూ కొండంత ధైర్యాన్ని కరపత్రంలో పంచి పోతాడు
ఏ జ్వరమో వచ్చి అతడు రాని రోజు
చిక్కని రాత్రి కళ్ళు చీకటి కన్నీళ్ళు రాలుస్తాయి
అతడి జీతభత్యాల గురించి ఎవరికీ తెలియదు
అతడి జీవిత సత్యాల గురించి ఎవరికీ పట్టదు
ఒక్క తన పెంకుటిల్లు తప్ప
అందరిళ్ళకూ పహరా కాస్తాడు
మనకు జీతం వచ్చిన రోజు నుంచీ
అతడు తన జీతం తాడు పేనుకుంటూ పోతాడు
ఒక్క రూపాయి బిళ్ళో, రెండు రూపాయల కాయితమో చాలు
అవనత శిరస్కుడై'అచ్చా సాబ్' అంటూ వినమ్రంగా నిష్క్రమిస్తూ ఉంటే
అతడి జేబు బావి లోంచి చిల్లర గొంతులు బాధగా మూల్గుతాయి...