మా రంగయ్య పెదనాన్న ఈ మధ్యనే చనిపోయాడు. ఆయన గురించి, నా చిన్ననాటి చదువుల గురించి పోయిన సంక్రాంతికి ఇంటికెళ్లొచ్చాక...చిన్న ఆర్టికల్ లాగా రాశాను. ఆయన స్మృతి కోసం మరోసారి.....
------------------------------------------------------------------------------------------------------------
పెద్దాయన పెద్ద మనసు కథ
ఇంటికి
ఎవరైనా బంధువులు వస్తున్నారంటే...చచ్చాంరా దేవుడా.... అనుకునే లైఫ్ స్టైల్
ఈ కాలం మనుషులది. కానీ ఊరు గాని ఊరు, ఏమీ కాని వారు.... ఒకరిద్దరు
కాదు...ఒకరోజు రెండు రోజులు కాదు. దాదాపు 40ఏళ్లపాటు...డజన్ల కొద్దీ విద్యార్ధులను ఆదరించి...తమ ఇంట్లో ఆశ్రయమిచ్చి... సొంత మనుషుల్లా చూసుకున్న కుటుంబం కల్లూరి రంగయ్య గారిది. పెదనాన్న అని
నేను పిలుచుకునే ఆయన కథ చెప్పడానికి ముందు నా కథ కొంచెం చెప్పాలి. మా
ఊళ్లో ఒకటి రెండు తరగతుల వరకే స్కూల్. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదవాలంటే
పొరుగున 2కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడెం వెళ్లాలి. అంతకుమించిన చదువుకు 4కిలోమీటర్ల
దూరంలో ఉన్న ముల్కలపల్లి వెళ్లాలి. పొలాలు, తోటలు, ఓ చెరువు, రెండు కొండల
మధ్య చిట్టడవిలో కాలిబాట. ఇలా ఉంటుంది బాట. ఇదంతా నేను ఓనమాలు
నేర్చుకునేటప్పటి పరిస్థితి. అంతకు ముందు పరిస్థితులు మళ్లీ వేరు....
అందనాలపాడు నుంచి ముల్కలపల్లి, మన్నెగూడెంలకు రూట్ మ్యాప్ ******************************************************************* 1983కి
నాకు ఐదేళ్ల వయసు. అప్పటికే అక్కలతో కలిసి మా ఊళ్లోనే కోమటి రామారావు
అన్నయ్య, పిచ్చమ్మక్కల దగ్గర ట్యూషన్ కు వెళ్లినట్లు గుర్తు. అక్కడే ఓనమాలు
దిద్ది ఉంటాను. ఆ తర్వాత మా ఊరు బడిలో జాయిన్ చేశాడు నాన్న. ముత్తయ్య
సార్ అని ఒకే ఒక్క టీచర్. ఆ స్కూల్లో ఒకటి రెండు తరగతులు చదివాను.
మన్నెగూడెంలో కొత్తగా కాన్వెంట్ ఓపెనయింది. సీతారాం సార్ అనే ఆయన ఓ చిన్న
ఇంట్లో స్టార్ట్ చేశాడు. రాధమ్మ, రాధకృష్ణలాంటి వాళ్లు అప్పటికే జాయిన్
అయ్యారు.రెండో తరగతి కాగానే నాన్న కూడా నన్ను సరస్వతీ కాన్వెంట్ లో
చేర్పించాడు....ఒకే ఏడాది రెండు తరగతులు సిస్టమ్ అక్కడ ఉండేది. 3,4
క్లాసులు ఏడాదిలో పూర్తి చేశాను. ఇప్పటికి ఏవో నాలుగు ఇంగ్లీషు ముక్కలు
తెలిశాయంటే...వాటికి పునాది సరస్వతి కాన్వెంట్ లోనే పడింది
సరస్వతీ కాన్వెంట్ ( అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది)
********************************************************************
ఐదో
తరగతికి ఛలో ముల్కలపల్లి. అప్పటికే రంగయ్యగారి గురించి అక్కవాళ్లు
చెబుతుంటే వినడం తప్ప...పెద్దగా తెలియదు. అక్కలతో కలిసి రోజూ నాలుగు
కిలోమీటర్లు రాను, నాలుగు కిలోమీటర్లు పోను...మొత్తం 8 కిలోమీటర్ల నడక.
ఒకట్రెండు కాదు...ఆరేళ్లు..ఐదు నుంచి పదో తరగతి వరకు ముల్కలపల్లిలోనే. అదే
నడక...నడక...నడక. ఈ సమయంలోనే మా వూరి వాళ్లందరినీ ఆదరించిన కల్లూరి
రంగయ్యగారి కుటుంబంతో అనుబంధం ఏర్పడింది.

ఇదే కల్లూరి రంగయ్య పెదనాన్న గారి ఇల్లు ******************************************************************** నలభై
ఏళ్ల కిందటే ముల్కలపల్లిలో స్కూలు ఉండేది. కాకపోతే...పొరుగూళ్ల నుంచి
వచ్చే పిల్లలకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు.లంచ్ బాక్సులు
పెట్టుకోడానికి...తినడానికి ప్లేస్ గానీ, మంచి నీళ్లుగానీ అందుబాటులో
ఉండేవి కావు. అప్పట్లో వాటర్ బాటిల్స్ వాడకం అసలే తెలీదు. లంచ్ బాక్సులు
తెచ్చుకున్న వారు వాటిని బ్యాగులోనే పెట్టుకోవడం, మధ్యాహ్నం ఏటి దగ్గరికో,
బోర్ వెల్ దగ్గరికో వెళ్లి తినాల్సి రావడం. లేదంటే...ఎవరింట్లోనో చేదబావి
ఉంటే అక్కడ కూర్చుని తినడం...ఇదీ దుస్థితి. అలా తంటాలు పడుతున్న మా వూరి
విద్యార్ధులను ఇంట్లోకి పిలిచి అక్కడే కూర్చుని భోజనం చేయండని చెప్పినవాడు
కల్లూరి రంగయ్యగారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఆయన అన్నమాటను నిన్న మొన్నటి
వరకు నిలబెట్టుకున్నారు. ప్రతియేటా వచ్చే వాళ్లు వస్తుంటారు..పోయేవాళ్లు
పోతుంటారు. అందనాలపాడు గ్రామం నుంచి వచ్చే ప్రతి విద్యార్ధికి ఆశ్రయం
అక్కడే. సొంత ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా వాళ్లింటికి వెళ్లడం, వంటగదిలోనే
కూర్చుని లంచ్ బాక్సులు తినడం. ఒకరిద్దరు కాదు...20, 30మంది పిల్లలు రోజూ
వాళ్లింటో కూర్చుని భోజనాలు. బంధువులతో మాట్లాడినంత ఆప్యాయంగా పిల్లలతో
మాట్లాడేవాళ్లు, కష్టసుఖాలు చెప్పుకునేవాళ్లు. పిల్లలు కూడా వారిని వరసలు
పెట్టి పిలుస్తూ....ఇంట్లో మనుషులే అన్నంతగా కలిసిపోయేవాళ్లు. స్కూల్ బెల్
కాకముందే వచ్చిన వాళ్లు ఇంట్లోనే ఆటలాడుతున్నా, అల్లరి చేస్తున్నా ...ఒక్క
మాట అనే వాళ్లు కాదు. పిల్లలపై ఒక్కసారి కూడా కోపం ప్రదర్శించిన సందర్భాలు
లేవు. ఇంటి ముందు చెత్తవేసినా, ఇంట్లో ఏం చేసినా...పల్లెత్తు మాట అనని
మంచితనం వారి సొంతం. అందనాలపాడు నుంచి ముల్కలపల్లి స్కూలుకు వచ్చే
పిల్లలందరికీ కేరాఫ్ అడ్రస్ రంగయ్య పెదనాన్న వాళ్ల ఇల్లు. క్లాసుల్లేక
ముందుగా వచ్చినవాళ్లు, లాస్ట్ పీరియడ్ వరకు ఉన్న వారి కోసం ఎదురు
చూస్తున్నవారు....ఆటాపాటా అన్ని రంగయ్య పెదనాన్న ఇంటిదగ్గరే. వానొచ్చినా,
వరదొచ్చినా...తడిసి వచ్చి ఇల్లంతా బురద చేసినా....ఎక్కడా ఒక్క మాటన్నది
లేదు. సామాజికంగా వారిది అగ్రకులం. కానీ వాళ్లింటికి వచ్చే విద్యార్ధుల్లో
అన్ని రకాల కులాల వాళ్లున్నారు. అందరినీ సమానంగా...తమ పిల్లలతో సమంగా చూసిన
మానవీయత రంగయ్య పెదనాన్న కుటుంబానిది. టెన్త్ క్లాస్ లో ట్యూషన్ లు, ఎక్స
స్ట్రా క్లాసులు చదవడానికి ఇబ్బందవుతుందని తెలిసి...మా ఇంటిదగ్గరే ఉండడని
పిలిచి ఆశ్రయం కల్పించిన వారు రంగయ్య పెదనాన్న. టెంత్ క్లాసులో మా అక్కను,
సెవెంత్, టెన్త్ క్లాసుల్లో నన్ను వాళ్లింట్లోనే ఉంచేసుకున్నారు. నేనే
కాదు..ఎందరో విద్యార్ధులు ఆ ఇంట్లో ఉండి...వారు వండి పెట్టింది తిని
చదువుకున్నారు. చిన్న పని కూడా చెప్పకుండా...వాళ్లు తినే అన్నమే మాకూ
పెడుతూ, మా నుంచి ఏమీ ఆశించకుండా ఆశ్రయమిచ్చిన సహృదయులు రంగయ్య పెదనాన్న.
పోనీ ఇంతమంది పిల్లలను ఆదరిస్తున్న వాళ్లేమైనా ధనికులా అంటే అదీ లేదు.
ఎదుగూబొదుగూ లేని జీవితం. వ్యవసాయాన్నే నమ్ముకుని వచ్చిన దాన్లోనే సంతృప్తి
చెందే నిండైన రైతు కుటుంబం. తనకున్న కొద్దిపాటి పొలంలోనే కొంత స్కూల్ కు
దానమిచ్చిన మనసున్న రంగయ్య పెదనాన్న. అడుగు జాగా కోసం ప్రాణాలు తీసే
వారున్న ఈ రోజుల్లో...ఉన్న కొద్దిపొలంలో కొంత దానంగా ఇవ్వడం మామూలు విషయం
కాదు. అలాంటి కుటుంబాన్ని మర్చిపోవడమంటే మానవీయతను మర్చిపోవడమే. మమ్మల్నింత
ఆదరించిన పెదనాన్నకు ఏదైనా చేయాలని ఎన్నాళ్ల నుంచో అనుకునే వాణ్ని. నేనే
కాదు...వారింట్లో ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరిదీ అదే ఫీలింగ్. కాలం
మారిపోయి...బిజీ లైఫుల్లో పడిపోయి.. రెండు దశాబ్దాలు గడిచిపోయింది. మొన్న
సంక్రాంతికి అందరికీ కుదిరింది. ముల్కలపల్లి స్కూల్లో చదివిన మా బంధువులంతా
కూర్చుని రంగయ్య పెదనాన్నను సత్కరించాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నదే
తడవుగా రంగంలోకి దిగాం. కార్లు కూడా అందుబాటులో ఉండటంతో ఆ కుటుంబాన్ని
పరిచయం చేద్దామని, మా స్కూలును కూడా చూపిద్దామన్న భావనతో మా పిల్లలను కూడా
తీసుకుని బయలుదేరాం.అదే ఇల్లు. అదే మనుషులు.అదే ఆప్యాయత. ఇసుమంత మార్పు లేదు
రంగయ్య పెదనాన్న, ఆయన మనవడు గణేశ్ తో నేను
********************************************************************
ఎప్పుడో చిన్నప్పుడు చూసిన రూపం. ఇప్పుడు గుర్తు పడతాడో లేదో
అనుకుంటూనే...పెదనాన నన్ను గుర్తుపట్టావా అన్నా. కిట్నవు కదూ అన్నారు
నవ్వుతూ రంగయ్య పెదనాన్న. మా రాక కుటుంబానికి ఎంతో సంతోషం కలిగించింది.
కుశల ప్రశ్నల తర్వాత పాత జాపకాలు నెమరు వేసుకుని రంగయ్య పెదనాన్నను
సన్మానించాం. 40 ఏళ్ల కిందట రంగయ్య పెదనాన్న కుటుంబం నుంచి తొలిసారి ఆశ్రయం
పొందిన మా అత్తగారు పద్మావతి చేతుల మీదుగా వారికి చిన్న సత్కారం జరిగింది.
రంగయ్య
పెదనాన్నతో నేను, శకుంతల(బ్లాక్ చున్నీ), ప్రసాద్(వైట్ షర్ట్),
వెంకట్రావు(స్ట్రైప్స్ షర్ట్), పద్మావతి(శారీ). (మేమంతా అలనాటి
స్టూడెంట్స్) నిలబడ్డ వారిలో శిరీశ(w/o ప్రసాద్-గ్రీన్ డ్రెస్) , ప్రియాంక
(d/o జయప్రద), శ్రీనివాస్(s/o పద్మావతి- టీ షర్ట్), శ్రీలత(w/o వెంకట్రావ్-
పింక్ డ్రెస్) ముందు మా పిల్లలు, రంగయ్య గారి మనవరాలు ********************************************************************
రంగయ్య పెదనాన్న పెద్ద కొడుకు అచ్చయ్య కుటుంబానికి సత్కారం ********************************************************************
రంగయ్య పెదనాన్న చిన్న కొడుకు నాగేశ్వరరావు కుటుంబానికి సత్కారం
*********************************************************************** ఆ తర్వాత మా చిన్ననాటి
స్కూలుకు పిల్లలతో సహా వెళ్లాం. అంతా మారి పోయింది. రెండు మర్రిచెట్లు,
రెండు వేపచెట్లు, మా చదువుకునేటప్పుడు ఏర్పాటు చేసిన గేటు, మేం కొట్టడానికి
తహతహలాడిన, ఎప్పుడు మోగుతుందా అని ఎదురు చూసిన గంట తప్ప...అంతా కొత్తగా
ఉంది. అన్నీ కొత్త బిల్డింగులు. అయినా సరే...అది మా బడే. మేం ఉయ్యాలలూగిన
మర్రిచెట్ల ఊడలను పట్టుకుని ఊగి మా పిల్లలు ఎంజాయ్ చేశారు.....
ఈ మర్రి ఊడలతో ఊయలూగిన జ్ఞాపకాలు
*******************************************************************
ఆనాటి మన బడి...ఎలా ఉండేదంటే....
*******************************************************************
ఒకప్పటి స్కూల్, ఇప్పుడు లైఫ్ మేట్
*******************************************************************
మర్రి చెట్టు కింద మా పిల్లలు
*******************************************************************
మా స్కూల్లో నా పిల్లలతో.....
*******************************************************************
మర్రిచెట్టు మీద మా పిల్లలు
*******************************************************************
అదే గంట...స్థానం మారిందంటే
*******************************************************************
ఒకప్పటి నా స్కూల్ మేట్స్ ప్రసాద్ (1989-90) పద్మావతి ( 1975-76) శకుంతల ( 1997-98) వెంకట్రావు (1988-89)లతో నేను.....
********************************************************************